తెలంగాణ

ప్రైవేట్ కాలేజీలకు ఊరట.. ఫీజు రియింబర్స్‌మెంట్‌ పై హైకోర్టు స్టే!

ప్రైవేట్ కాలేజీలకు ఊరట.. ఫీజు రియింబర్స్‌మెంట్‌ పై హైకోర్టు స్టే!

నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు రాష్ట్ర అత్యున్నత హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఫీజుల వసూలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం రియింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేసే వరకు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదంటూ జీవోలో పెట్టిన నిబంధనలను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

ప్రభుత్వం తరఫున నిధులు విడుదల కాకుండా, కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను ఎలా కొనసాగిస్తాయని కోర్టు ప్రశ్నించింది. సర్కారు బకాయిలు చెల్లించకుండా.. కాలేజీలు ఫీజులు వసూలు చేయవద్దని ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకం కోసం అసలు బడ్జెట్‌లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆ నిధుల విడుదల ప్రక్రియ ఎలా ఉందనే అంశాలపై వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది.

ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలు నిలిచిపోవడం వల్ల కాలేజీల మనుగడ సాగడం కష్టంగా మారిందని, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి జీతాలు చెల్లించడం కూడా యాజమాన్యాలకు భారంగా మారిందని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిబంధనలపై స్టే విధిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ లోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆగస్టు 15వ తేదీలోపు బకాయిలన్నీ క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.