నవదిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ మోసపూరిత పాలనలో తెలంగాణ రాష్ట్రము తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రాష్ట్రంలో రైతన్నలకు ఇచ్చే రైతు బంధు పథకాన్ని బంద్ చేసి, ఆ నిధులను ఢిల్లీకి తరలిస్తూ రాహుల్ బంధును ప్రారంభించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి సగం పరిపాలనా కాలం ముగిసిపోతున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి పదవిలోకి రాగానే తాను గుంపు మేస్త్రీనని, రియల్ ఎస్టేట్ గురించి తనకు బాగా తెలుసని ఫోజులు కొట్టారని, తీరా రెండున్నర సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టి లక్షలాది మంది ఉపాధిని దెబ్బతీశారని ఆరోపించారు.గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన చేవెళ్ల ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేశామని..చందన్వెల్లి, సీతారాంపూర్ పరిధిలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి మైక్రోసాఫ్ట్, అమెజాన్, వెల్స్ పన్ వంటి దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చి వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. కానీ నేడు హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతున్నారని మండిపడ్డారు.
రాహుల్ ఖాతా లోకి రైతు బందు ఎన్నికల ప్రచారంలో రైతు బంధు ఆపడానికి మాకేమైనా దిమాక్ లేదా?అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఈరోజు ఏ తెలివితో రైతు బంధు నిలిపివేశారో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక్కడి రైతుల నిధులన్నీ టింగు టింగుమంటూ రాహుల్ గాంధీ ఖాతాలోకి చేరుతున్నాయని ఎద్దేవా చేశారు.గత ప్రభుత్వం చేసిన అప్పులను సాకుగా చూపిస్తూ రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుం టున్నారని..బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతి రూపాయి అప్పు తెలంగాణ అభివృద్ధి,సంక్షేమానికి ఉపయోగపడిందని స్పష్టం చేశారు.గడిచిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 4 లక్షల కోట్ల అప్పుతో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.రేవంత్ రెడ్డి రైతులకు ఒక్క రూపాయి ఇచ్చినా అది కేవలం ఎన్నికల లబ్ధి కోసమేనని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రస్తుతం (ఆర్ ఆర్) టాక్స్ (రాహుల్ రేవంత్ టాక్స్) దందా నడుస్తోందని, రైతన్నలకు ఎరువుల సంచులు ఇవ్వలేని కాంగ్రెస్ నేతలు.. డబ్బుల సంచులతో ఢిల్లీకి వరుస కడుతున్నారని ఆరోపించారు. చేవెళ్ల వేదికగానే గతంలో దళితులకు, గిరిజనులకు డిక్లరేషన్ పేరిట దళిత బంధు ద్వారా 12 లక్షలు ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఉన్న అసైన్డ్ భూములను కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కమల్ హాసన్ తరహాలో యాక్టింగ్ చేస్తూ గ్యారంటీ కార్డులను దాచుకోమన్నారని, ప్రతి ఇంటికి రూ.2.50 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించి గొంతు కోశారన్నారు.
కాంగ్రెస్ పోవాలి, కెసిఆర్ రావాలి... ఈ అరాచక, అవినీతి పాలనను చూసిన తర్వాతే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని బలంగా కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీ కార్యకర్తలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటా నని.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా,రాజకీయంగా తగిన అవకాశాలు కల్పిస్తానని అయన భరోసా ఇచ్చారు.ఈ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, నేతలు పట్లొల్లా కార్తీక్ రెడ్డి, పట్నం అవినాష్ రెడ్డి, రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

