తెలంగాణ

టీచర్లెక్కడ మాస్టారూ?

టీచర్లెక్కడ మాస్టారూ?

నవదిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయుల కొరత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. బోధనా సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న తాత్కాలిక విధివిధానాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. 'వర్క్ అడ్జస్ట్‌మెంట్' పేరుతో మిగులు ఉపాధ్యాయులను డెప్యుటేషన్‌పై పంపడం మినహా, సమస్యకు ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పట్టణాలకే మొగ్గు.. మారుమూల ప్రాంతాల్లో దుస్థితి: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. బదిలీలు, డిప్యుటేషన్ల సమయంలో మెజారిటీ ఉపాధ్యాయులు జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలలో పనిచేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత మరింత క్లిష్టంగా మారుతోంది. రిమోట్ ఏరియాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో 50 నుండి 60 మంది విద్యార్థులున్న చోట ఇద్దరే టీచర్లు ఉంటుండగా, కొన్నిచోట్ల ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో ఐదు తరగతులను నడపాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, సబ్జెక్టుకు ఒక టీచర్ చొప్పున 30 మంది విద్యార్థులున్న చోట 5 నుండి 8 మంది ఉపాధ్యాయులు ఉంటున్నారు. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాల్సింది పోయి, బోధనేతర పనులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తాత్కాలిక చర్యలతో తప్పని తిప్పలు: విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల నుండి ఉపాధ్యాయులను గుర్తించి, అవసరమైన చోట్లకు కేవలం ఒక విద్యా సంవత్సరానికి మాత్రమే డిప్యుటేషన్‌పై పంపుతున్నారు. ఆ గడువు ముగిసిన తర్వాత మళ్లీ పాత పరిస్థితే పునరావృతమవుతోంది. ఈ తూతూమంత్రపు చర్యల వల్ల అటు ఉపాధ్యాయులకు స్థిరత్వం లేకపోగా, ఇటు విద్యార్థులకు నిరంతరాయంగా సరైన బోధన అందడం లేదు. టీచర్ల సర్దుబాటు వ్యవహారంలో భారీగా పైరవీలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పారదర్శకంగా రేషనలైజేషన్ నిర్వహించాలని, మారుమూల ప్రాంతాల్లోని ఖాళీ పోస్టుల్లో మిగులు ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన నియమించడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జీవో నెం.25 ఆధారంగా రేషనైజేషన్ వద్దు.. రాష్ట్రంలో జీవో 25 ఆధారంగా రేషనైజేషన్ ప్రక్రియ చేపట్టకూడదు. 1:19 కు ఇద్దరూ ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలలో ఉండాలి. ఉన్నత పాఠశాలకు సబ్జెక్టు ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉన్నప్పుడు ప్రాథమిక పాఠశాలలకు కూడా సబ్జెక్టు ఆధారితంగానే రేషనైజేషన్ ప్రక్రియ ఉండాలి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ఒకే హాబిటేషన్ లో ఉన్నటువంటి పాఠశాలలను కలిపి వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జీవో 25 ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రాథమిక పాఠశాలకు ఉపయోగంగా ఉండదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలి.

  • తెల్కలపల్లి పెంటయ్య, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి